తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అన్నారు. అయితే ఒక దిక్కే ఓటు హక్కు పెట్టుకోండి అని సూచించారు. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి.. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకోండి అని.. తెలంగాణలో నివసించే ఆంధ్రప్రదేశ్ పౌరులకు సూచించారు మంత్రి హరీష్ రావు. ఏపీలో పాలన ఎలా వుందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసన్నారు. సంగారెడ్డిలో మేస్త్రీ భవనం నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత మాట్లాడారు.
ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ ప్రత్యక్షంగా చూసుంటారని, అలాగే మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్తుంటారు కదా? అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారని అన్నారు. అలాంటి సమయంలో ఏపీలో ఓటెందుకు? అక్కడ క్యాన్సిల్ చేసుకుని తెలంగాణలో ఓటు నమోదు చేసుకోండని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. ”మీరు కూడా మా వాళ్లే. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే.” అని పునరుద్ఘాటించారు. కాబట్టి ఆంధ్రావాళ్లు తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోండి అని హరీష్ పేర్కొన్నారు.
తెలంగాణ డెవలప్ మెంట్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు చెప్పారని అన్నార. కార్మికులకు మేడే రోజున సీఎం శుభవార్త చెబుతారని హరీశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎకరా విస్తీర్ణంలో 2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామని, మేడే రోజున శంకుస్థాపన కూడా చేస్తామని హరీశ్ వెల్లడించారు.