ప్రధాని మోదీ మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కి రానున్నారు. ఉదయం 11.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నైకి వెళ్లనున్నారు. రెండు గంటలపాటు జరిగే ఈ సుడిగాలి పర్యటనలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. మోదీ పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పరిశీలించి మొదటి కోచ్‌లోని చిన్నారులతో, డ్రైవింగ్ క్యాబ్‌లోని సిబ్బందితో మాట్లాడతారు. 12.00 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. 12.05 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. 1.30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌స్టేషన్, పరేడ్ గ్రౌండ్‌ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎ్‌సజీ) శుక్రవారం తమ అధీనంలోకి తీసుకున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌తోపాటు బహిరంగ సభ జరిగే పరేడ్ మైదానంలో భారీగా బలగాలను మోహరించాయి. ప్రధానికి సుమారు 125 మంది భద్రతా సిబ్బందితో నాలుగు అంచెల భద్రతను కల్పించనున్నారు. ఎస్‌పీజీ దళాలు మొదటి సర్కిల్‌లో, కేంద్ర ఇంటెలిజెన్స్ సాయుధ బలగాలు రెండో సర్కిల్‌లో, NSG మూడో సర్కిల్‌లో, రాష్ట్ర పోలీసు బలగాలు నాలుగో సర్కిల్‌లో ఉంటాయి.