శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్ పిటిషన్ విచారణకు స్వీకరించింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం కోర్టును కోరింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండువారాలు వాయిదా వేసింది. షిండే వర్గం వాళ్లు ఈసీ ముందు వాదనల్లో విజయం సాధించారని, ఈ దశలో మేము ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని సుప్రీం తేల్చి చెప్పింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించింది. అంతేకాదు.. 1966లో శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ కూడా శిందే వర్గానిదేనని స్పష్టం చేసింది. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందంటూ మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ని రద్దు చేయాలంటూ డిమాండ్ కి దిగారు. అంతేకాకుండా ఈసీ నిర్ణయంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం పై విధంగా స్పందించింది.












