హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ , ఎక్సైజ్ & పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం ప్రభుత్వం తరుపున వారిని సన్మానించి, జ్ఞాపికలను అందజేసిన వారికీ శుభాకాంక్షలు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ “బాహుబలి’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సాధించాలంటే తనతోనే సాధ్యమని రాజమౌళి నిరూపించారు. నేడు ‘ఆర్‌ఆర్‌ఆర్’తో తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు.
నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుపొందడం తెలుగువారందరికి గర్వకారణమన్నారు. తెలంగాణ ఏర్పాటైన దగ్గరి నుంచి సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత సినీ ఇండస్ట్రీ ఏమైపోతుందోననే భయాలుండేవి. కానీ నేడు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ప్రభుత్వమే పరిశ్రమకు ఎక్కువగా చేయూతనిస్తున్నదన్నారు.
చంద్రబోస్ మట్లాడుతూ ‘ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం నాకు ఓ అబద్ధం లాంటి నిజమన్నారు. స్వప్నం లాంటి సత్యం. ఊహలాంటి వాస్తవం. ఓ కల్పన లాంటి యదార్థం. దానిని సాధ్యం చేసిన రాజమౌళి బృందానికి కృతజ్ఞతలు. ఆస్కార్ పొందిన సంతోషాన్ని అందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో నా పాటల ప్రయాణంలో తోడుగా ఉన్న వారందరిని ప్రత్యక్షంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశాను. అని తెలిపాడు. ఆస్కార్ పురస్కారాన్ని పట్టుకోగానే భారత సాహిత్య కీర్తి పతాకాన్ని చేతిలో తీసుకున్న ఆనందం కలిగిందన్నాడు.