నాటు నాటు పాటకి ఆస్కార్ ప్రకటించగానే రాజమౌళి అక్కడే ఎగిరి గంతేశారు. సాధించేశామంటూ కేరింతలు కొట్టారు. పక్కనే వున్న భార్య రమాను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ… నిజంగా ఇది కలగానే వుందన్నారు. అవార్డు వస్తుందన్న నమ్మకంతో వున్నామన్నారు. తన జీవితంలో అత్యంత అమూల్యమైన క్షణం మీ సినిమా అవార్డును గెలుచుకోవడమా? లేక ఆస్కార్ వేదికపై మీ సినిమాలోని పాటను ప్రదర్శించడమా అని అడిగితే ఎంపిక చేసుకోవడం నిజంగా కష్టమేనని చెప్పుకొచ్చారు. రెండింటినీ ఇలా ఒకే వేదికపై చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వేదికపై పాట ప్రదర్శన జరుగుతున్నంత సేపు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం, పూర్తయ్యాక స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం చూస్తే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నన్ను నిలబెట్టినట్లు అనిపించింది. అలాగే ఆస్కార్ అవార్డు పెద్దన్న కీరవాణిని శిఖరాగ్రాన నిలబెట్టింది’’ అని రాజమౌళి చెప్పారు.

RRR సినిమా చరిత్ర నెలకొల్పింది. ప్రతీ తెలుగువాడు, ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన సమయమిది. RRR సినిమాలోని మోస్ట్ పాపులర్ పాట నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డు వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి.













