కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్ కి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకూ RRR సినిమా ఆస్కార్ విజేలతో తేనీటి విందులో పాల్గొంటారు. 5:15 కి అక్కడి నుంచి బయల్దేరి.. చేవెళ్లకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు చేవెళ్లకు చేరుకొని, పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అమిత్ షా.
తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేరికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా తెలుస్తుంది. అనూహ్యంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.
చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో వచ్చే ఎన్నికలకు సమర శంఖారావం అమిత్ షా పూరించనున్నారని, ఆ పర్యటనతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం బీజేపీ దూకుడు మరింత పెరుగుతుందని కమలనాథులు చెబుతున్నారు. అమిత్ షా సభను భారీ స్ధాయిలో నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇంకా ఐదు రోజులు మాత్రమే అమిత్ షా బహిరంగ సభకు టైమ్ ఉండటంతో కాషాయ నేతలు ఏర్పాట్లను షురూ చేయనున్నారు. భారీగా జనసమీకరణ చేసేందుకు బీజేపీ ఇప్పటికే ప్లాన్ వేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ ఛుగ్ ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశం నిర్వహించారు. ఇటీవలే బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన జూపల్లి, పొంగులేటిని పార్టీలో చేర్పించాలని తెగ ప్రయత్నాలు నడుస్తున్నాయి. అయితే… వారిద్దరూ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.