కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ప్రీతి మృతి కేసుపై ఇన్నాళ్లుగా నెలకొన్న మిస్టరీ వీడింది. రెండు నెలలు అయినా ప్రీతి ఆత్మహత్య చేసుకుందా..? లేకుంటే హత్యనా..? అనేదానిపై తేలకపోగా తాజాగా పోస్టుమార్టమ్ రిపోర్టుతో కీలక విషయాలు బయటికొచ్చాయి. పీజీ డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ సీపీ రంగనాథ్ తేల్చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఈ విషయం తేలిందని సీపీ స్పష్టం చేశారు. ప్రీతి ఆత్మహత్యకు ప్రధాన కారణం సైఫే అని.. అతని వేధింపుల వల్లనే ఈ ఘటన జరిగిందని తేల్చారు. వేధింపులు తట్టుకోలేక ప్రీతి పాయిజన్ తీసుకుందని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించి వారం, పదిరోజుల్లో చార్జ్‌షీటు దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ సైఫ్‌కు బెయిల్‌ మంజూరైంది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్‌కు బుధవారం (ఏప్రిల్ 19న) షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది.