మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందిన ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.బాలింతలు మృతిచెందిన ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ వేశామని హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. కమిటీ ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.మృతిచెందిన బాలింతలకు సర్జరీ జరిగిన రోజే మరో 11 సర్జరీలు కూడా జరిగాయని చెప్పారు. మిగిలిన వారికి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కాలేదని.. కానీ ఇద్దరికే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగాయని హెల్త్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.
మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ కి చెందిన శివాని ఒకరు కాగా… నాగర్ కర్నూలుకి చెందిన సిరివెన్నెల మరొకరు. శివాని అనే గర్భిణిని కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ముందస్తు పరీక్షలే చేయకుండా.. వైద్యులు ఏకంగా ఆపరేషన్ చేసేశారు. రక్త స్రావం కావడంతో గాంధీకి తరలించారు. అప్పటికే ఆమెకు బీపీ వుందని వైద్యులు గుర్తించారు. చికిత్స పొందుతూ శివానీ మరణించింది.
నాగర్ కర్నూలు జిల్లా, చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను కూడా ఆమె కుటుంబసభ్యులు ప్రసవం కోసం మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమెకు డెంగ్యూ ఉన్నా.. వైద్యులు గుర్తించలేదు. అలాగే ఆమెకు డెలివరీ చేశారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో హుటా హుటిన గాంధీకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.







