ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లపై అధికారులతో సమీక్షించారు. సీఎం సమీక్షా సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలకు అత్యంత నాణ్యమైన ఇళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ ప్రకటించారు. సొంత ఇల్లు అనేది పేదల చిరకాల స్వప్నమని, ఇళ్ల నిర్మాణాల్లో ఏ చిన్న లోపానికీ తావు ఇవ్వొద్దని సీఎం ఆదేశించారు.
లే అవుట్ లలో ఏర్పాటు చేసిన ల్యాబ్ లను వినియోగించుటకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, ప్రతి పేద కుటుంబానికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామాగ్రిని అందించడం రూపంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ 13,780 కోట్లు ఖర్చు చేసిందని ప్రకటించారు. మౌలిక సదుపాయాల ఖర్చుల కోసం 3,117 కోట్లు ఖర్చు చేశామని, వైఎస్సార్, జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారుల తదితర సదుపాయాల కోసం 32,909 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
సొంత ఇల్లు అనేది పేదవాడి కల, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని అధికారులను సీఎమ్ జగన్ ఆదేశించారు. ల్యాబ్స్‌ను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలన్నారు. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలని అధికారులను సూచించారు.
కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. సుమారు 30 వేలమందికి ఇళ్ల నిర్మాణంలో కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అసవరమైన భూ సేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబర్ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని సీఎం తో వివరించారు అధికారులు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.