జరగని విషయాన్ని జరిగినట్లు చూపిస్తున్నారు : కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఫైర్

ఫోన్ ట్యాపింగ్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి చేస్తున్న విషయంలో ఎలాంటి వాస్తవాలు లేవని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణలు అబద్ధమని శివారెడ్డి చెబుతున్నారని, జరగని విషయాన్ని జరిగినట్లు చిత్రీకరించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్ అని చెబుతున్నారని, జరిగింది ఫోన్ ట్రాప్ కాదని, చంద్రబాబు ట్రాప్ అని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని, ట్యాపింగ్ వార్తలే నిజమైతే… ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదని నిలదీశారు.

 

వాపును చూసి బలమని కోటంరెడ్డి భ్రమపడుతున్నారని, ప్రజలంతా వైఎస్ జగన్ వెంబడే వున్నారని పేర్కొన్నారు. ఇక.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మండిపడ్డారు. ప్రతిరోజూ శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి, డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయం అంతా మచ్చలేకుండా సాగుతోందన్నారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో కోటంరెడ్డి ఎన్నిక అరాచకాలు చేశారో… ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. కోటంరెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుందని ఆదాల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.

 

మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి .. ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోనని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి పునరద్ఘాటించారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై ఆయన మండిపడ్డారు. నెల్లూరు రూరల్‌ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అని అంతా చెబుతున్నారని ఆయన అన్నారు. అసలు ఆదాల ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బీఫామ్‌ తీసుకుని.. జగన్‌ను కలిసిన ఘనత ఆదాలది అని గుర్తు చేశారు.

Related Posts

Latest News Updates