పేదరికం అనేది చదువుతోనే పోతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనంతపురం జిల్లా నార్సలలో జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ… వారి వారి తల్లుల ఖాతాల్లోకి 912 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. సామాజిక వర్గాన్ని కూడా మార్చేస్తుందన్నారు. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రావొద్దన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. విద్యా దీవెనకు తోడుగా వసతి దీవెన అందిస్తున్నామని, ఫీజు రియంబర్స్ మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని, యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై సెటైర్లు వేశారు. జాతీయ మీడియాకు ఒక ముసలాయన ఇంటర్వ్యూ ఇచ్చారని, వచ్చీరానీ ఇంగ్లీష్‌తో రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారన్నారు. అది చూస్తే తనకు పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయన్నారు. నరమాంసం తినే పులి ఇప్పుడు ముసలిదైందన్నారు. వేటాడే శక్తి లేకనే నాలుగు నక్కలను తోడేసుకుందన్నారు. మనుషులను చంపడం ఎలా అని ప్లాన్ చేసిందని, ఆ పులి అడవిలో తనకు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెబుతోందన్నారు. పులి ఇప్పుడు తానెవరినీ తినడంలేదని నమ్మిస్తోందని.. నరమాంసం తినే పులి.. మారిందంటే నమ్ముతామా? అని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పేవారిని ఎప్పుడూ నమ్మొద్దని, చంద్రబాబుకు ఎప్పుడూ బుద్ధి రాదని, మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు పాత డైలాగ్‌లు మాట్లాడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.